జాతీయ వార్తలు

శ్రీకృష్ణ జన్మభూమి వివాదం.. షాహీ ఈద్గా సర్వేకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

KPS డిజిటల్ నెట్‌వర్క్, అలహాబాద్‌ :- ఉత్తర్‌ప్రదేశ్‌ మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి భూవివాదానికి సంబంధించి అలహాబాద్‌ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 17వ శతాబ్ధానికి చెందిన షాహీ ఈద్గా సర్వేకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. సర్వే చేసేందుకు కోర్టు పర్యవేక్షణలో అడ్వకేట్ కమిషనర్‌ని నియమించేందుకు కోర్టు అంగీకరించింది. అయితే అలహాబాద్‌ కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఈద్గా తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవ‌కాశాలు ఉన్నాయి.

షాహీ ఈద్గా మసీదుపై అడ్వకేట్ కమిషనర్ సర్వే చేయడానికి కోర్టు అనుమతి ఇచ్చిందని, ఈ నెల 18న విధివిధానాలు నిర్ణయిస్తారని అడ్వకేట్ విష్ణు శంకర్ జైన్ తెలిపారు. విచారణ సమయంలో షాహీ ఈద్గా మసీదు వాదనల్ని కోర్టు తోసిపుచ్చింది.

షాహి ఈద్గా మ‌సీదును 17వ శ‌తాబ్ధంలో నిర్మించారు. కోర్టు నియ‌మించే కమిష‌న‌ర్ ఆధ్వర్యంలో స‌ర్వే చేప‌ట్టనున్నారు. శ్రీ కృష్ణుడు జ‌న్మించిన స్థలంలో ముస్లింలు మ‌సీదు నిర్మించిన‌ట్లు హిందూవాదులు ఆరోపిస్తున్నారు. హిందూ సేన‌కు చెందిన విష్ణు గుప్త స‌ర్వే కోసం డిమాండ్‌ చేశారు. విష్ణు గుప్త దాఖ‌లు చేసిన పిటీష‌న్‌ను స్థానిక కోర్టు గ‌త డిసెంబ‌ర్‌లో స్వీక‌రించింది. అయితే ఈద్గా తరపు న్యాయవాదులు అభ్యంత‌రం వ్యక్తం చేస్తూ పిటీష‌న్ దాఖ‌లు చేశారు.

శ్రీకృష్ణ జ‌న్మస్థానంలో ఉన్న మొత్తం 13.37 ఎక‌రాల భూమిపై హిందువుల‌కే హ‌క్కును క‌ల్పించాల‌ని హిందూసేన డిమాండ్ చేస్తోంది. ఇక్కడ ఉన్న కాట్ర కేశ‌వ దేవ్ ఆల‌యాన్ని కూల్చి.. దాని స్థానంలో మ‌సీదును నిర్మించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మొఘ‌ల్ చ‌క్రవ‌ర్తి ఔరంగ‌జేబు ఆదేశాలతో ఆ అక్రమ నిర్మాణం జ‌రిగినట్టు ఆరోపణలు ఉన్నాయి.

Leave a Reply