ఆంధ్రప్రదేశ్

ఆనాడు ‘జగన్’ పాదయాత్ర చేసేవాడా?: చంద్రబాబు నిప్పులు

అమరావతి : రాజకీయాల్లో కొన్ని విలువలుంటాయి. దానిని అందరూ పాటించాలి. మనది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ప్రజల వద్దకు వెళ్లే హక్కు ప్రతి రాజకీయ నాయకుడికి ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పంలో చంద్రబాబు రోడ్ షోను పోలీసులు అడ్డుకోవడంతో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. దీంతో అక్కడ వాతావరణమంతా ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా పోలీసులపై చంద్రబాబు ఫైర్ అయ్యారు.

మీరు మనసు చంపుకుని విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ సంగతి నాకు తెలుసు, ఆరోజున సీఎంగా ఉన్న నేను కూడా సీరియస్ గా తీసుకుంటే జగన్ పాదయాత్ర చేసేవాడా? అని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యం, ఆ రాజకీయ విలువలను అందరూ పాటించాలని అన్నారు.

టీడీపీ శ్రేణుల మాటేమిటంటే…దేశమంతా రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. బీజేపీ నేతలేమీ అడ్డుకోవడం లేదే? ఆనాడు వైఎస్ పాదయాత్ర చేసినప్పుడు, జగన్ పాదయాత్ర చేసినప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉంది కదా… అడ్డుకోలేదు కదా…అలాగే మా నేత చంద్రబాబు పాదయాత్ర చేసినప్పుడు కాంగ్రెస్ అడ్డు పడలేదు. ఇది ప్రజాస్వామ్య దేశం…ప్రజల వద్దకు వెళ్లే అధికారం రాజకీయ నాయకులకు ఉంది. దీనినెవరూ ఆపలేరని వ్యాక్యానిస్తున్నారు.

ప్రతిపక్షం గొంతు ఎత్తకూడదు. వాళ్లు బయటకు రాకూడదు. ప్రజల దగ్గరకు వెళ్లకూడదు. రోడ్ షోలు చేయకూడదు, ఊరిబయట సభలు పెట్టాలి…ఏమిటీ అర్థం, పర్థం లేని చీకటి జీవోలు అంటూ తెలుగుదేశం నేతలు ఎక్కడికక్కడ, ఆ జీవో కాపీలను దగ్ధం చేస్తున్నారు. రాష్ట్రమంతా గగ్గోలుగా ఉంది.

మొత్తానికి రోడ్ షోకు అనుమతి లేదని పోలీసులు అనడంతో చంద్రబాబు పెద్దూరు నుంచి పాదయాత్రగా వెళ్లారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తనని అడ్డుకుంటారా? అని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలతో మాట్లాడే హక్కు లేదా? అంటూ నిప్పులు చెరిగారు. అనంతరం వెనక్కి తగ్గేదే లే…అంటూ తిరిగి హైదరాబాద్ వెళ్లకుండా కుప్పంలో రాత్రి బస చేశారు. ఉదయం టీడీపీ పార్టీ కార్యాలయంలో నేతలతో సమావేశం కావాలని నిర్ణయించారు. అనంతరం గూడుపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో మళ్లీ అందరిలో టెన్షన్ మొదలైంది.

Leave a Reply