తెలంగాణ

వదలని సీబీఐ: కవితకు మళ్లీ నోటీసులు

హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ కవితను సాక్షిగా మాత్రమే సీబీఐ విచారించారని అనుకుంటే, సీబీఐ మరో నోటీసు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఏడున్నర గంటలపాటు కవితను విచారించిన సీబీఐ అధికారులు వెళుతూ వెళుతూ 91 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు.

ఈసారి మాత్రం చెప్పినచోట విచారణకు హాజరు కావాలి, సీబీఐ అడిగిన పత్రాలు, ఆధారాలు సమర్పించాలి. అంతేకాదు ఎవరికి నోటీసులిస్తే వారే హాజరుకావాల్సి ఉంటుందనేది అందులో సారాంశంగా తెలిసింది. మరిన్ని డాక్యుమెంట్లకు సంబంధించి సమాచారం కావాలని కవితకు ఇచ్చిన నోటీసుల్లో సీబీఐ పేర్కొంది. విచారణ తేదీ, సమయం త్వరలోనే మెయిల్ చేస్తామని సీబీఐ తెలిపింది.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను సీబీఐ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. మద్యం కేసులో దక్షిణాది లాబీ అంశాలపై ప్రశ్నించినట్టు సమాచారం. ఈడీ అరెస్ట్ చేసిన శరత్ చంద్రారెడ్డి, సీబీఐ అరెస్ట్ చేసిన బోయినపల్లి అభిషేక్, నిందితుడు రామచంద్ర పిళ్లయిలతో పరిచయాలు, వ్యాపార సంబంధాలు ఉన్నాయా? అని ఆరా తీసినట్టు తెలిసింది. మధ్యలో భోజన విరామ సమయం ఇచ్చిన తర్వాత సాయంత్రం ఆరున్నర వరకు విచారణ సాగింది.

అనంతరం వారు కవిత ఇంటి నుంచి వెళ్లారు.

వారు వెళ్లగానే కవిత హుటాహుటిన ప్రగతిభవన్ కి వెళ్లి కేసీఆర్ ను కలిశారు. రాజకీయ కక్షతో ఇబ్బందులు పెట్టేందుకు బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించవని, సీబీఐ విచారణ అందులో భాగమేనని అన్నట్టు సమాచారం.

Leave a Reply