తెలంగాణ

వ్యవస్థలు అస్తవ్యస్తం.. సీఎం రేవంత్‌ రెడ్డికి ఇదే టఫ్ ఛాలెంజ్!

KPS డిజిటల్ నెట్‌వర్క్, తెలంగాణ :- ఎలక్షన్ కోడ్ రావడంతో పాటే.. తెలంగాణ ప్రభుత్వ ఆదాయం చాలా వరకు ప్రభావితమైంది. కీలక శాఖల నుంచి రావాల్సిన ఇన్ కమ్ తగ్గిపోయింది. రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్ ఆదాయం, జీఎస్టీ, పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ ఇవన్నిటిపై ఎఫెక్ట్ కనిపించింది. మరోవైపు గత సర్కార్ అప్పులను ఆర్థిక పరిస్థితిని ప్రస్తుత ప్రభుత్వం సమీక్ష చేస్తోంది.

రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఏర్పడినప్పటి నుంచి అంటే సెప్టెంబర్​ నుంచే ప్రభుత్వ ఆదాయం తగ్గింది. అనుకున్న అంచనాల కంటే తక్కువ మొత్తంలో రాబడి వస్తోంది. అధికారుల లెక్కల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అంటే 2024 మార్చి నాటికి రావాల్సిన మొత్తం రెవెన్యూ 2.16 లక్షల కోట్లు. అయితే ఇందులో లక్షా 15 వేల కోట్లు మొన్న నవంబర్​ చివరి నాటికి వచ్చింది. అంటే ఇంకా మిగిలిన నాలుగు నెలల్లో లక్ష కోట్ల రూపాయలు రావాలి.

ఖజానాకు ప్రధాన ఆదాయ వనరుగా ఎక్సైజ్​, స్టాంప్స్​ అండ్​ రిజిస్ర్టేషన్స్​, జీఎస్టీ, వ్యాట్ ద్వారానే సమకూరుతోంది. అయితే గత ప్రభుత్వం ముందస్తు లిక్కర్​ కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇవ్వడం, లైసెన్సులు ముందే కట్టబెట్టడంతో అప్పుడే రావాల్సినంత రాబడిని పిండుకుంది. ఇప్పుడు యావరేజ్ ​గా లిక్కర్​ సేల్స్ ​తో నెలకు 2,300 కోట్లు వస్తుంది. అనుకున్న టార్గెట్ ప్రకారమైతే 3 వేల కోట్ల నుంచి 3.5 వేల కోట్ల దాకా రావాలి.

ఇక స్టాంప్స్​ అండ్​ రిజిస్ర్టేషన్స్ ​తో నవంబర్​ చివరి నాటికి 12 వేల కోట్లు రావాల్సి ఉండగా.. 9,500 కోట్లే వచ్చింది. 4 వేల కోట్లు తగ్గింది. ఎన్నికల ఎఫెక్ట్​ తో చెకింగ్ లతో రియల్​ బూమ్​ లేక భారీగా భూముల క్రయవిక్రయాలు ఆగిపోయాయి. అది కాస్తా సర్కార్​ ఆదాయంపై పడింది. జీఎస్టీ కూడా అంతంత మాత్రంగానే వస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 51 వేల కోట్లు లక్ష్యంగా ఉండగా.. నవంబర్​ నాటికి వచ్చింది 30 వేల కోట్లలోపే. మిగిలిన 4 నెలల్లో ఇంకా 20 వేల కోట్లు రావడం కష్టమేనని అధికారులు అంటున్నారు.

రాష్ట్రం ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకోవాల్సిన అప్పులన్నీ మరో 4 నెలలు మిగిలి ఉండగానే పూర్తిగా గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం తీసేసుకుంది. 12 నెలల కాలంలో తీసుకోవాల్సిన అప్పులను 8 నెలల్లోనే తీసుకుందని ఆర్థిక శాఖ వర్గాలు చెప్తున్నాయి. 2023-24లో దాదాపు 40 వేల కోట్లు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మొత్తం గత నవంబర్​ లోనే అంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కంటే ముందే తీసుకుంది.

సగటున ప్రతినెలా దాదాపు 5వేల కోట్లు అప్పు చేసింది. ఇప్పుడు కొత్తగా ఆర్​బీఐ నుంచి అప్పులు తీసుకునే చాన్స్​ లేకుండా చేసింది. ఇతర మార్గాల ద్వారా అప్పులు ఎట్లా సమకూర్చు కోవాలనే దానిపై కొత్త ప్రభుత్వం దృష్టిపెట్టింది. గత ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఏకంగా 5.3 లక్షల కోట్ల మేర అప్పులు చేసింది.

గత సర్కార్ అప్పుల విషయంలో ఏం చేసిందన్నది రాష్ట్ర ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది. అందుకే శ్వేతపత్రం రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క ఇప్పటికే ఈ విషయంపై సమీక్ష జరిపారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, ఆదాయ, వ్యయాలు, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. 2014 జూన్ రెండో తేదీ నుంచి ఈ ఏడాది డిసెంబర్ 7 వరకు రాష్ట్ర ఆదాయం, వ్యయం, కలిగిన ప్రయోజనాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు.

రాష్ట్రం ఐదున్నర లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందని, అయినప్పటికీ సవాల్​గా ఆర్థికశాఖ బాధ్యతలు తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు నెరవేర్చేలా ఆదాయాన్ని పెంచుకోవడం కోసం అధికారులు మనస్ఫూర్తిగా పనిచేయాలని వారిని కోరారు. మానవ వనరులను బలోపేతం చేసుకోవడం వల్ల జీడీపీ పెరుగుతుందని, ఈ ఉచితాలు.. మానవ వనరులపై పెట్టుబడులుగానే చూడాలంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే రెండింటిని అమలు చేశామని డిప్యూటీ సీఎం అన్నారు. గత సర్కారు వ్యవస్థలను అస్తవ్యస్తం చేసిందంటూ ఫైర్ అయ్యారు.

ఆరు గ్యారెంటీలో కీలకమైంది ఇంటికి 200 యూనిట్ల దాకా ఫ్రీ కరెంట్. అయితే విద్యుత్ సంస్థల అప్పులు ఇప్పటికే 85 వేల కోట్లకు చేరాయని ఇటీవలి రివ్యూలో తేలింది. దీనిపై రేవంత్ సర్కార్ సీరియస్ కూడా అయింది. విద్యుత్‌ సంస్థల ఆర్థిక పరిస్థితి, ఆదాయ, వ్యయాలు, అప్పులు, నష్టాల వివరాలను విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డికి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించాయి.

రాష్ట్ర ఆవిర్భావం నుంచి 2023–24లో రాష్ట్ర విద్యుత్‌ సంస్థల ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలిపేందుకు శ్వేతపత్రాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కు ఏటా 4 వేల కోట్లు అవసరం అని లెక్కలేశారు. ఇందులో కొంత భారం తగ్గించుకోవాలంటే.. పరిష్కార మార్గాలు కూడా సర్కార్ ముందు ఉన్నాయి. రాష్ట్రంలో 27.99 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లుండగా, వీటికి ఉచితంగా సరఫరా చేస్తున్న కరెంట్ కు కచ్చితమైన లెక్కలు లేవు. దీంతో ఇందులో క్లారిటీ తీసుకుంటే కొంత వరకు ఆదా చేసే అవకాశం ఉందంటున్నారు.

ప్రభుత్వం ఏదైనా ఒక అంశంపై విడుదల చేసే సాధికారిక నివేదికను లేదా మార్గదర్శక పత్రాన్ని శ్వేతపత్రం అంటారు. అంటే, ఒక అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు, ప్రభుత్వ అధికారిక సమాచారంతో రూపొందించిన వాస్తవ నివేదికే శ్వేతపత్రం. ఇప్పుడు వీటిని జనం ముందు ఉంచుతూనే.. 6 గ్యారెంటీలను వందరోజుల్లోగా పట్టాలెక్కించే పనిలో స్పీడ్ పెంచింది రేవంత్ రెడ్డి సర్కారు.

రైతు భరోసా ఎవరెవరికి వర్తింపజేయాలన్న విషయాలపైనా సూచనలు సలహాలు వస్తున్నాయి. కొండలు గుట్టలు.. వ్యవసాయం చేయని భూములను పక్కన పెట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఎకరాలకు కటాఫ్ పెడుతారా అన్న చర్చ కూడా జరుగుతోంది. వ్యవసాయం చేసే వారికే పెట్టుబడి సహాయం అందించాలని, భూస్వాములు, కొండలు గుట్టలు, బీడు భూములకు రైతు భరోసా ఇవ్వొద్దన్న డిమాండ్లు గతం నుంచి ఉన్నవే.

తాజాగా రైతు భరోసాపై సెక్రటేరియట్ లో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. కౌలు రైతులకు వర్తింపజేయడం, వారిని గుర్తించడం ఇవన్నిటిపై చర్చించారు. అయితే రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏవైనా గైడ్ లైన్స్ ప్రకటిస్తుందా లేదంటే మునుపటి మాదిరిగానే అందరికీ ఇస్తుందా అన్నది చూడాల్సి ఉంది.

Leave a Reply