ఆంధ్రప్రదేశ్

అగ్నిగుండంగా మారిన ఏపీ.. మరో రెండు రోజులు తీవ్ర వడగాల్పులు..

KPS డిజిటల్ నెట్‌వర్క్, వెబ్ డెస్క్: ఏపీ అగ్నిగుండంగా మారింది. భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో ఎండలు మండుతున్నాయి. గురువారం ఉష్టోగ్రతలు భారీగా పెరిగిపోయాయి. 210 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి. రాష్ట్రంలోని 31 శాతం మండలాలు నిప్పుల గుండంగా మారాయి. మరో 220 మండలాల్లో వడగాల్పుల తీవ్రత అధికంగానే ఉంది. మొత్తంగా 64 శాతంపైగా మండలాల్లోని ప్రజలు ఉష్ణతాపానికి అల్లాడారు. నర్సాపురంలో సాధారణం కంటే అధికంగా 7.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది.

శుక్ర, శనివారాల్లో వడగాల్పుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. 268 మండలాల్లో తీవ్రంగా వడగాల్పులు వీస్తాయని ప్రకటించింది. మరో 235 మండలాల్లో వడగాల్పుల ప్రభావంగా ఉంటుందని తెలిపింది.

గురువారం అనకాపల్లి జిల్లాలోని 23 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి. విశాఖపట్నం జిల్లాలోని 8 మండలాల్లో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా ఏలూరు జిల్లా పంగిడిగూడెంలో 44.5 డిగ్రీల ఉష్టోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లా కురిచేడులో 44.2 డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లా చిట్యాల, ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో 44.1 డిగ్రీలు, తిరుపతి జిల్లా సత్యవేడులో 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణం కంటే విశాఖపట్నం, బాపట్లలో 7.1 డిగ్రీలు, మచిలీపట్నంలో 6.9 డిగ్రీలు, జంగమహేశ్వరపురంలో 6.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా రికార్డయ్యాయి.

Leave a Reply