తెలంగాణ

ఫాంహౌజ్‌ కేసులో సిట్ దర్యాప్తు సక్రమంగా లేదని తేల్చిన హైకోర్టు

తెలంగాణ : తెలంగాణలో కేసీయార్ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బ్రందం (సిట్) దర్యాప్తు సక్రమంగా లేదని హైకోర్టు అభిప్రాయ పడింది. ఈ కేసుని సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం ప్రకటించింది. ఇకనుంచి ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థల ఆధ్వర్యంలో దర్యాప్తు జరగబోతోంది.

అక్టోబర్ 26వ తేదీన ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తెర మీదకు వచ్చింది. తెలంగాణ లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటానికి బీజేపీ ప్రయత్నిస్తోందన్నది ఆరోపణ. ఈ మేరకు ఫామ్ హౌస్ లో నలుగురు టీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుగుతుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొన్నామని తెలంగాణ పోలీసులు ప్రకటించారు. ఈ బేరసారాల వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉందని వెల్లడించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సహా అనేకమంది అగ్రనేతలకు సిట్ నోటీసులు జారీచేసింది. ఈ లోగా రూ. కోట్ల రూపాయిల వ్యవహారం కావటంతో ఈ కేసులో ఈడీ కూడా దర్యాప్తు ప్రారంభించింది.

అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సిట్ దర్యాప్తు సక్రమంగా జరగటం లేదని, ఈ కేసుని సీబీఐకి అప్పగించాలని నిందితులతో పాటు బీజేపీ కూడా హైకోర్టుని ఆశ్రయించింది. ఈ కేసు పూర్వాపరాలు విచారించిన హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల స్ఫూర్తితో సిట్ దూకుడుగా వ్యవహరించిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ దూకుడులోనే తప్పటడుగులు పడ్డాయన్న మాట వినిపిస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు దర్యాప్తు బాధ్యతను కేంద్రం పరిధిలోని సీబీఐ చేపడుతోంది. అటువంటప్పుడు కేసీయార్ ప్రభుత్వానికి చిక్కులు తప్పవంటూ అప్పుడే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Leave a Reply