ఆంధ్రప్రదేశ్

అభ్యర్థుల ఖరారుపై టీడీపీ-జనసేన ఫోకస్‌.. లెక్కలు తేలేదెప్పుడు ?

KPS డిజిటల్ నెట్‌వర్క్, అమరావతి :- కురుక్షేత్ర సమరాన్ని తలపిస్తున్న ఏపీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలన్ని అభ్యర్థుల ఖరారుపై తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. అధికార వైసీపీ ఇప్పటికే ఐదు జాబితాలు విడుదల చేయగా.. అటు ఉమ్మడిగా బరిలోకి దిగుతున్న టీడీపీ-జనసేన కూటమి కూడా అభ్యర్థులను ఖరారు చేయడంపై దృష్టి సారించాయి. ఈ రెండు పార్టీలు ఇప్పటికే 13 ఎంపీ సీట్లను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇందులో 11 చోట్ల టీడీపీ.. రెండు చోట్ల జనసేన పోటీ చేసేందుకు లైన్ క్లియర్ అయినట్టు సమాచారం. అయితే 11 మంది టీడీపీ అభ్యర్థుల్లో ముగ్గురు వైసీపీ నుంచి వచ్చిన నేతలే ఉన్నారు. మరో రెండు, మూడు సీట్లలో అభ్యర్థులను ఖరారు చేయకుండా పెండింగ్‌లో ఉంచారు. నరసాపురం నుంచి రఘురామకృష్ణంరాజు, నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు.. మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరికి టికెట్ దక్కే అవకాశం కనిపిస్తోంది.

జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారన్నది ఇంకా ఫైనల్ కాకపోయినప్పటికీ ప్రస్తుతానికి మచిలీపట్నం, కాకినాడ సీట్లు కేటాయించినట్టు తెలుస్తోంది. శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖపట్నం, అమలాపురం, నరసాపురం, ఏలూరు, విజయవాడ, నరసరావుపేట, తిరుపతి, రాజంపేట, అనంతపురం, హిందూపురంలో టీడీపీ బరిలో ఉండనుంది. శ్రీకాకుళంలో రామ్మోహన్‌, విశాఖలో భరత్‌, తిరుపతిలో నీహారిక, బెజవాడ నుంచి కేశినేని చిన్ని అభ్యర్థిత్వాలు ఖరారు కాగా.. ఇతర సీట్లకు సంబంధించి ఆశావాహుల సంఖ్య భారీగానే ఉన్నట్టు తెలుస్తోంది.

ఒంగోలు, నెల్లూరు అభ్యర్థులపై కసరత్తును ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉంచింది టీడీపీ. ఇక్కడ అసెంబ్లీ స్థానాల్లో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉన్నందున వీటి విషయం తర్వాత ఆలోచించాలని నిర్ణయించింది. ఇక మిగిలిన 12 ఎంపీ సీట్లకు సంబంధించి పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. వీటిపై కూడా త్వరలోనే ఓ క్లారిటీ రానుంది. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై రెండు సార్లు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్ మధ్య చర్చలు జరిగాయి. త్వరలో మరోసారి చంద్రబాబు, పవన్ భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

Leave a Reply