ఆంధ్రప్రదేశ్

టీడీపీ-జనసేన కూటమిలోకి బీజేపీ? పొత్తు కుదిరినట్టేనా?

KPS డిజిటల్ నెట్‌వర్క్, ఆంధ్రప్రదేశ్‌ :- ఏపీలో ఎన్నికల వేడి సెగలు కక్కుతోంది. వైసీపీ అధినేత సీఎం జగన్‌ను గద్దె దించేందుకు ప్రతిపక్షాలు పక్కా స్కెచ్‌ వేస్తున్నాయి. మూకుమ్మడిగా ఢీకొట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే టీడీపీ, జనసేనలు ఉమ్మడిగా పోరాటం చేస్తున్నాయి. పలు సమావేశాలు, సభలు నిర్వహించడమే కాకుండా.. సీట్ల సర్దుబాటుపై కూడా చర్చలు సాగుతున్నాయి.

ఈ తరుణంలో బీజేపీ కూడా కలిసి రావాలని ఇప్పటికే జనసేన అధినేత కమలనాథులకు సూచించారు. అయితే.. ప్రస్తుతం ఏపీలో ఎప్పటికప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాలతో టీడీపీ, బీజేపీ పొత్తు కుదిరినట్టే అనిపిస్తోంది. ఒకనాటి స్నేహగీతాన్ని మళ్లీ మొదలు పెట్టేందుకు.. తెలుగు తమ్మళ్లతో దోస్తీకి పురంధేశ్వరి సై అంటున్నారన్న వార్తలు కూడా జోరందుకున్నాయి. ఇక మిగిలిందల్లా ఢిల్లీ పెద్దలు గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వడమే.

గత కొంతకాలం క్రితమే వైసీపీ అరాచక పాలన అంతమొందించాలంటే పొత్తులు తప్పవని సూచించారు జనసేనాని. చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత టీడీపీతో పొత్తుపై జనసేన క్లారిటీ ఇచ్చారు. అయితే.. ఈ సమయంలో ఎలాంటి విమర్శలకు దిగలేదు కమల దళం. ముందు నుంచి ఉన్న సఖ్యతనే జనసేనతో కొనసాగించింది.

అయితే.. పలుమార్లు పవన్‌ సూచించినా కూడా కమలనాథులు పెదవి విప్పకుండా మౌనం పాటించారు. కాదని కానీ, ఔనని కానీ తేల్చి చెప్పలేకపోయాయి. ఈ వ్యవహారంపై ఎటూ తేలకుండానే ఏపీలో ఎన్నికలకు సమయం ఆసన్నంకాండంతో.. టీడీపీ, జనసేనలతో బీజేపీ కలుస్తుందన్న ఊహాగానాలు జోరందుకున్నాయి.

అందరి టార్గెట్‌ జగనే కాబట్టి.. ప్రత్యర్థులంతా ఒక్కటై వైసీపీని గద్దె దించే వ్యూహాల్లో ఉన్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే విజయవాడ పరిణామాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అక్కడి ఎంపీ సీటు కోసం కేశినేని బ్రదర్స్‌ మధ్య యుద్ధ వాతావరణమే నడిచింది. అయితే.. తాజాగా బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పేరు తెరపైకి రావడంతో పొత్తుల వ్యూహం హాట్ టాపిక్‌గా మారింది.

టీడీపీతో జత కట్టేందుకు కమలనాథులు సిద్ధంగా ఉన్నారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. టీడీపీ, జనసేనల మధ్య ఉమ్మడి కార్యాచరణ ఇప్పటికే ప్రారంభంకాగా.. సీట్ల సర్దుబాటుపై చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు బీజేపీ కూడా తోడైతే ఎవరికి ఎన్ని సీట్లు కేటాయిస్తారు..? ఏ స్థానాల్లో ఎవరి అభ్యర్థిని బరిలో దించుతారన్న ఉత్కంఠ నెలకొంది.

Leave a Reply