ఆంధ్రప్రదేశ్

నర్సింగ్‌ విద్యార్థినులకు లైంగిక వేధింపులు.. కళాశాల ఛైర్మన్‌ అరాచకం..

KPS డిజిటల్ నెట్‌వర్క్, వెబ్ డెస్క్: విజయవాడ గ్రామీణ మండలం అంబాపురంలో నర్సింగ్ స్టూడెంట్స్ రోడ్డెక్కారు. అర్ధరాత్రి, అపరాత్రి లేకుండా క్లాసుల పేరుతో కాలేజ్ ఛైర్మన్ కమ్ ప్రిన్సిపల్ వేధిస్తున్నారని, అసభ్యకరంగా మెసేజ్‌లు చేస్తున్నారని ఆరోపించారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో విజయవాడ కొత్తపేట పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు.

రా త్రి 11 గంటలకు తరగతులు ఉన్నాయంటూ ప్రిన్సిపల్ రమ్మంటున్నారని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. శరీరంపై టచ్ చేస్తూ, అసభ్యంగా మాట్లాడుతున్నారని వాపోయారు. ఆరోగ్యం బాగలేకున్నా.. కనీసం ఇంటికి ఫోన్‌ చేసేందుకు కూడా అనుమతించేవాళ్లు కాదన్నారు.

ప్రిన్సిపల్‌గా, ఛైర్మన్‌గా రవీంద్రరెడ్డే ఉండటం, అతని చేతిలో ఇంటర్నల్‌ మార్కులు ఉండటంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలిసేది కాదన్నారు. రెండేళ్ల క్రితం సీనియర్‌ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం తెలిసి, అదే పరిస్థితి తమకూ ఎదురవుతుందనే భయంతో కళాశాల నుంచి వెళ్లిపోయేందుకు నిర్ణయించుకున్నామని విద్యార్థులు తెలిపారు. ఈ మధ్యే మరో విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆందోళన చేసినట్లు చెప్పారు.

కడప జిల్లా బద్వేలుకు చెందిన బసిరెడ్డి రవీంద్రరెడ్డి అంబాపురంలో నర్సింగ్ కాలేజ్ నడువుతున్నారు. భద్రాచలం, నూజివీడు, విస్సన్నపేట, తిరువూరు ప్రాంతాలకు చెందిన 83 మంది విద్యార్థినులు హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. తమతో రవీంద్రరెడ్డి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని బీఎస్సీ ఫస్టియర్ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. టీసీలు ఇచ్చేయాలని డిమాండ్‌ చేశారు. కొందరు సర్టిఫికెట్లు తీసుకుని ఇంటికి వెళ్లిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బసిరెడ్డి రవీంద్రరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply