ఆంధ్రప్రదేశ్

చిరంజీవి సీఎం అయ్యేందుకు ఇదే లాస్ట్ ఛాన్స్.. చింతా మోహన్‌ సంచలన వ్యాఖ్యలు

KPS డిజిటల్ నెట్‌వర్క్, తిరుపతి :- చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రావాలని అన్నారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చింతా మోహన్‌. ఆయన సీఎం అయ్యేందుకు ఇది చివరి అవకాశమని సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అన్నారు. అలాగే ఏపీ రాజధానిగా తిరుపతి ఉండాలని డిమాండ్ చేశారు.

చిరంజీవికిం సీఎం అయ్యేందుకు ఇది చివరి అవకాశమని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చింతా మోహన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా ఉన్నాయని.. చిరంజీవికి ఇదే మంచి అవకాశమని తెలిపారు. మెగాస్టార్‌ చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రావాలని కోరారు. ముఖ్యమంత్రి అవ్వడానికి చిరంజీవికి ఇదే చివరి అవకాశమని.. చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేయాలని విజ్ఞప్తి చేశారు. చిరంజీవి ఇప్పుడు రాకపోతే పదేళ్ల పాటు కాపులు, బలిజలకు ఏ అవకాశం దక్కదని తెలిపారు. ఏపీలో సీఎం జగన్ పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని అన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి 10 సీట్లు లోపు వస్తాయని జోస్యం చెప్పారు. పాకిస్థాన్‌ కంటే ఘోరంగా ఏపీ రాజకీయాలు ఉన్నాయని..రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కావాలని అన్నీ వర్గాలు కోరుతున్నట్లు పేర్కొన్నారు.

చంద్రబాబు తీరు దారుణం..

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను అర్థరాత్రి చంద్రబాబు కలవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు తీరుతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభ ఘోషిస్తోందన్నారు. వైఎస్‌ షర్మిల రావటం వల్ల కాంగ్రెస్ కు లాభం చేకూరిందని అభిప్రాయపడ్డారు చింతా మోహన్. షర్మిల రాకతో కాంగ్రెస్ మైలేజ్ మరింత పెరిగిందన్నారు. షర్మిలను సీఎంగా చూడాలని ప్రజల్లో ఉందని.. కాంగ్రెస్ 130 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. రెండో స్థానంలో చంద్రబాబు నిలుస్తారని చెప్పుకొచ్చారు. తిరుపతి రాజధాని అవుతుంది, అవ్వాలని ప్రజలు కోరుతున్నారని వ్యాఖ్యానించారు. తిరుపతి రాజధానిగా మారితేనే రాయలసీమలో కరువు పోయి అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు. సీమకు నీళ్లు లేవు.. రాళ్లు మిగిలాయని.. బ్రహ్మంగారు కాల జ్ఞానంలో తిరుపతి రాజధాని అవుతుందని రాశారని చెప్పుకొచ్చారు.

ఏపీ రాజధాని తిరుపతే..

తిరుపతి రాజధాని అవుతుందని అందరూ ఎదురు చూస్తున్నారని.. అందరికీ ఆమోద యోగ్యమైన ప్రాంతమన్నారు. ఇక్కడ భూములు, వనరులు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నాయన్నారు. మూడు రాజధానులు అని చెప్పిన వైసీపీ ప్రభుత్వం.. రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ అనటం ఏంటి? అని ప్రశ్నించారు. తన స్వార్థం, ఆర్థిక ప్రయోజనాల కోసం చంద్రబాబు హైదరాబాద్ ను విడిచి తుళ్లూరుకు వచ్చారని ఆరోపించారు. అలాగే వైసీపీ నేతలు కూడా తమ సొంత లాభాల కోసం విశాఖను రాజధాని చేయాలని అంటున్నారని మండిపడ్డారు. తమిళనాడులో జయలలిత ముఖ్యమంత్రి అయినట్లు ఏపీలో వైఎస్ షర్మిల సీఎం కావాలని రాష్ట్ర మహిళలు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఓ మహిళా సీఎం కాకూడదా? అని ప్రశ్నించారు.ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. షర్మిల సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply