ఆంధ్రప్రదేశ్

అన్నతో చెల్లులు ఢీ.. వదినామరుదుల మధ్య పోరు తప్పదా..?

KPS డిజిటల్ నెట్‌వర్క్, ఆంధ్రప్రదేశ్‌ :- ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు యమ రంజుగా సాగుతున్నాయి. అధికార పీఠాన్ని కైవసం చేసుకునేందుకు తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అన్న చందంగా బంధుప్రీతిని పక్కన పెట్టి.. రాజకీయ ప్రత్యర్థులుగా మారి ఎన్నికల ఫైట్‌లో సై అంటే సై అంటున్నారు. ఎత్తులకు పైఎత్తులు వేస్తూ కుటుంబ అనుబంధాన్ని సైతం లెక్క చేయకుండా విజయమే లక్ష్యంగా.. తమ గమ్యాన్ని చేరేందుకు ఎవరైతే ఏంటి..? డోంట్ కేర్‌ అంటూ ముందుకు సాగుతుండటంతో ఏపీ పాలిటిక్స్‌ వింటర్‌లోనూ వేడి పుట్టిస్తున్నాయి.

అన్నా చెల్లెల్లంటే వారి మధ్య ఉండే అనురాగం, ఆప్యాయతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తండ్రి తర్వాత తండ్రిలాంటివాడు అన్న. అంతటి ఆత్మీయత ఉండే అన్నా చెల్లెళ్లు విరోధులైతే.. సై అంటే సై అని కాలుదువ్వితే.. ఏపీ రాజకీయాల్లో అదే జరుగుతోంది. త్వరలో జరిగే ఆంధ్ర ఎన్నికల పోరులో కాంగ్రెస్ వైసీపీ నుంచి షర్మిల, జగన్ రంగంలోకి దిగుతున్నారు. గతంలో జగన్‌ పంపిన బాణం నేను అంటూ రాజకీయ వేడిని రగిలించి అన్న విజయానికి దోహదపడిన చెల్లెలు షర్మిల.. ఇప్పడు అదే అన్నను ఓడించడానికి కంకణం కట్టుకున్నారు. వైఎస్‌ఆర్‌ తనయుడిగా టీడీపీని మట్టి కరిపించి ఏపీని ఏలుతున్న జగన్‌ను.. అదే వైఎస్‌ఆర్‌ కూతురుగా తానేంటో నిరూపించుకునేందుకు ప్రజాక్షేత్ర యుద్ధంలో తలబడుతున్నారు షర్మిల. అన్నపై బహిరంగంగానే పోరుకు సిద్ధంగా ఉన్న షర్మిల.. కాంగ్రెస్‌ అధిష్టానం పీసీసీ పగ్గాలు కూడా అప్పజెప్పింది.

ఇదే వైరం అటు నారా, నందమూరి ఫ్యామిలీలోనూ కనిపిస్తోంది. వదిన మరిది సైతం నువ్వా నేనా అన్నట్టు ఎన్నికల ఫైట్‌లోకి దిగుతున్నారు. బంధువులన్న మమకారం మరిచి ఆంధ్రా యుద్ధంలో గెలుపే లక్ష్యంగా ఢీ అంటే ఢీ అంటూ పోరుకు సిద్ధమవుతున్నారు. 40 ఏళ్లకుపైగా రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఓటమే టార్గెట్‌గా వ్యూహాలు రచిస్తున్నారు బీజేపీ ఏపీ చీఫ్‌ పురుంధేశ్వరి. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని కొందరు బీజేపీ నేతలు కోరుతున్నా ప్రస్తుతానికి అది కార్యరూపం దాల్చలేదు. పొత్తు పొడుస్తుందో, లేదో ఇప్పటికి డౌటే. అటు జనసేన సైతం చంద్రబాబు పక్షాన చేరింది. సంస్థాగతంగాను బలంగా ఉన్న చంద్రబాబు నాయుడిని, ఏపీలో బలహీనంగా ఉన్న కమలం సాయంతో పురంధేశ్వరి ఎలా ఢీ కొడుతారనేది ఉత్కంఠగా మారింది.

అటు వైఎస్‌ఆర్‌ కుటుంబంలో అన్నా చెల్లెల మధ్య పోటీ.. ఇటు నారా, దగ్గుబాటి ఫ్మామిలీ మధ్య రాజకీయ యుద్ధం ఏపీ పాలిటిక్స్‌లో హీట్‌ పుట్టిస్తున్నాయి.

Leave a Reply